అమరావతి: రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకునే వారు రోజువారీ వ్యాపారాల కోసం తెలిసిన ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చుకుని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో ఎక్కువ శాతం, ఆ అప్పులకు వడ్డీ చెల్లించేందుకే సరిపోతుందని, అందుకు వారిని ఆదుకుంటానని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్, నేడు ఆ మాట నిలుపుకోనున్నారు.
రోజు వారి వ్యాపారాల కోసం అప్పుల కోసం వీధి వ్యాపారులు పడుతున్న అవస్థలను, ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ‘జగనన్న తోడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్‌లైన్‌లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
చిరు వ్యాపారులు 36–60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని అమలు చేస్తున్నారు. రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులు.