అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకు 60 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరం అని, వాటిని పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ లేఖ రాశారు.
రాష్ట్రంలో టీకా ఉత్సవ్‌లో కేవలం ఒక్కరోజే 6,28,961 మందికి డోసులు ఇచ్చినట్లు తన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీలోనే ఎక్కువ డోసులు ఇచ్చామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల మరియు సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సుసాధ్యమైందని రాశారు.
రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాల అవసరాలను ఒక వాలంటీరు తీరుస్తున్నారని ప్రధానికి ఈ లేఖలో వివరించారు. ఏపీలో వ్యాక్సిన్ డ్రైవ్‌ను వాలంటీర్లు సమర్థంగా చేపట్టారన్నారు. అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చూస్తున్నామన్నారు. వచ్చే మూడు వారాల్లో ఏపీలో 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఆ లక్ష్య సాధన కోసం తమకు తక్షణం 60 లక్షల డోసులు కేటాయించాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.