తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు అక్టోబర్ 2వ తేదీన ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్నవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చప్పట్లతో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటర్లకు అభినందనలు తెలిపారు.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమై సరిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంకురార్పణ చేశారు. కార్యదర్శుల నియామకం చేపట్టి ఈ వ్యవస్థను జనవరి 26న పూర్తి స్థాయిలో సేవలందిచే దిశగా తీసుకెళ్ళారు.
సమస్త సేవలనూ రాష్ట్ర ప్రజలకు చేరువ చేశారు. సచివాలయ వ్యవస్థతో సరికొత్త విప్లవం తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు సామాన్యుడు సైతం సమస్యలను వేగంగా, సులభంగా పరిష్కరించుకునేందుకు గ్రామ వార్డు సచివాలయలు ఎంతో ఉపయోగుపడుతున్నాయి.
ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డుల్లోనే పొందేలా వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వ పథకాలు సైతం వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే దరిచేరుతున్నాయి. ఇప్పటికే 1 కోటి పైగా సర్వీసులను నమోదు చేయగా దాదాపు 94 లక్షల సర్విసులు పరిష్కారానికి నోచుకున్నాయి. దీని ద్వారా ఈ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ను నిశితంగా గమనిస్తూ ఆచరించడానికి ఆలోచిస్తున్నాయి.