అమరావతి: ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి గాను కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ అత్యవసరంగా సమావేశమయ్యారు.
బడ్జెట్ కేటాయింపుల వివరాలను వివిధ రంగాల వారీగా అధికారులు సీఎంకు వివరించారు. 2014 లో రాష్ట్ర విభజన కారణంగా చాలా రంగాలవారీగా, మౌలిక సదుపాయాల రూపేనా తీవ్ర నష్టం ఏర్పడిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పట్ల ఆశగా చూశామని చెప్పారు. అయితే ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని అధికారులు తెలిపారు.
మన సమీపంలో ఉన్న తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలతో సమాన స్థాయిలోకి రావడానికి అవసరమైన ప్రత్యేక దృష్టి కేంద్ర బడ్జెట్‌లో కనిపించలేదని వెల్లడించారు. బడ్జెట్ సందర్భంగా వివిధ రంగాలకు, కార్యక్రమాలకూ చేసిన కేటాయింపులు అన్నిరాష్ట్రాల తరహాలోనే ఏపీకి వస్తాయి తప్ప, రాష్ట్రానికి మాత్రం ఏమీ ప్రత్యేకించి కేటయించలేదని తెలిపారు. పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాలకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
ఇంకా ఆహారం, పెట్రోల్, ఎరువుల రాయితీలను కూడా తగ్గించిన విషయాన్ని అధికారులు నివేదించారు. కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో లైజనింగ్ చేసుకుని సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని చెప్పారు.