అమరావతి: జగన్ యూకే పర్యటనకు అభ్యర్థనపై విచారణ వాయిదా!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతించవద్దని సీబీఐ కోర్టును కోరింది.
జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెను కలుసుకునేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, సీబీఐ ఈ పిటిషన్‌కు వ్యతిరేకంగా, గతంలో ఉన్న కేసుల విచారణ ఇప్పటికీ పూర్తికాకపోవడం వల్ల జగన్‌కు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు అభ్యంతరం వ్యక్తం చేసింది.
జగన్ మీద 11 కేసులు నమోదైనప్పటి నుంచి, దాదాపు పదిహేనేళ్లుగా ఈ విచారణలు సాగుతున్నాయి.
2011 తర్వాత ఈ కేసుల్లో జగన్ 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు, ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. సీబీఐ అభ్యంతరాలను ఎదురిస్తూ, జగన్ తరపు న్యాయవాదులు గతంలో కోర్టు అనుమతులు ఇచ్చిన సందర్భాలను గుర్తు చేశారు.
జగన్ ఎప్పుడూ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని న్యాయవాదులు పేర్కొన్నారు.
సీబీఐ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. మరోవైపు, జగన్ సన్నిహితుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అదే కేసులో యూరప్‌లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
సాయిరెడ్డి, 6 నెలల్లో 60 రోజుల పాటు విదేశీ పర్యటనలకు అనుమతి కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 30కు వాయిదా వేశారు.
జగన్ ఇటీవల తన డిప్లొమాట్ పాస్‌పోర్ట్‌ను సాధారణ పాస్‌పోర్ట్‌గా మార్చుకున్నారు. ఆగస్టు 1న విజయవాడలో పాస్‌పోర్ట్ మార్పు ప్రక్రియను పూర్తి చేశారు.
కొంతకాలంగా బెంగళూరులో ఉన్న జగన్, మంగళవారం తాడేపల్లి చేరుకున్నారు. జూన్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ ఆరు సార్లు బెంగళూరు వెళ్లొచ్చారు.