హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కరోనా రోగులకు ఉచితంగా సేవలందించేందుకు మూడు అంబులెన్సులను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో అంబులెన్సులను కొనుగోలు చేసి గాంధీభవన్‌లో సిద్ధంగా ఉంచింది. హైదరాబాద్ నగరంలో 50 కిలోమీటర్ల పరిధి వరకు ఈ ఆంబులెన్స్ లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, అంబులెన్స్ అవసరమైన వారు కంట్రోల్ రూం నెంబర్ 040–24601254కు ఫోన్ చేయాలని తెలిపారు.
కోవిడ్ సోకిన వారు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు, డిశ్చార్జి తరువాత ఇంటికి వెళ్లేందుకు ఈ అంబులెన్సులను వాడుకోవచ్చని తెలిపారు. ఏఐసీసీ సూచనల మేరకు కరోనా రోగుల సేవార్థం ఈ ఆంబులెన్స్ లను ఏర్పాటు చేశారు. ఆదివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ఈ అంబులెన్సులను ప్రారంభించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కోవిడ్ మహమ్మారి పట్టణాలను దాటి పల్లెలకు విస్తరించిందని, ప్రస్తుతం గ్రామీణ తెలంగాణ భయం గుప్పెట్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం కారణంగా ప్రజలు దినదినగండంగా బతకాల్సి వస్తోందన్నారు.
దేశంలో పక్కన ఉన్న రాష్ట్రాలు కరోనాకు ఉచిత వైద్యం అందిస్తుంటే ఇక్కడి ప్రజలు మాత్రం చికిత్స కోసం లక్షల కొద్దీ రూపాయలు వెచ్చించి అప్పుల పాలై రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా పరీక్షల విషయంలోనూ విఫలమైందన్నారు.
నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీల సూచన మేరకు రాష్ట్రంలో కరోనా బాధితులకు సాయమందించడంలో కాంగ్రెస్ శ్రేణులు అంకిత భావంతో పనిచేస్తున్నాయని ఉత్తమ్ ప్రశంసించారు. తన సొంత ఖర్చుతో అంబులెన్సులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.