ఆంధ్రప్రదేశ్: పిఠాపురంలో జనసేన ‘జయకేతనం’..భారీ ఏర్పాట్లు
జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది.
అంతర్జాతీయ స్థాయిలో సభా ఏర్పాట్లు
‘జయకేతనం’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), బిల్ క్లింటన్ (Bill Clinton), జార్జి బుష్ (George Bush) సభలను నిర్వహించిన అనుభవం ఉన్న ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్ కొల్లిపర (Prashanth Kollipara) నేతృత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికను తీర్చిదిద్దారు.
అత్యాధునిక ఆడియో-విజువల్ సదుపాయాలు
12 రోజులుగా 470 మంది సాంకేతిక నిపుణులు వేగంగా పనులు పూర్తి చేశారు. కిలోమీటర్ దూరం నుంచి కూడా వేదిక సమీపంలో ఉన్న అనుభూతిని కలిగించేలా అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 23 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఇటలీ లైనర్ రేస్ (Liner Race) టెక్నాలజీ ఉపయోగించి వేదిక నిర్మాణం జరిగింది.
భద్రతా ఏర్పాట్లు – భారీ పోలీస్ బందోబస్తు
సభలో భద్రతను పక్కాగా అమలు చేసేందుకు 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. 1,700 మంది పోలీసులను నియమించారు. చిత్రాడ పరిసర ప్రాంతాల్లో 9 వాహన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల వరకు కాకినాడ – పిఠాపురం – కత్తిపూడి మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో రాక
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి 3.45 గంటలకు చిత్రాడలోని సభా ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు.
సాంస్కృతిక ప్రదర్శనలు, భవిష్యత్తు కార్యాచరణ
సభ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. తొలుత తెలుగు భాష ప్రాధాన్యం, పార్టీ సిద్ధాంతాలు, విశేషాలను చాటి చెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చివరిగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ప్రగతిపథం, జనసేన భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించనున్నారు.