టోక్యో: జపాన్ దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోయింది. దీన్ని పెంచడానికి ఇప్పుడు ఆ దేశం వినూత్నంగా ఆలోచించింది. ఆ దేశ యువతీ యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించి జననాల రేటు పెంచడం కోసం ప్రతి కొత్త జంటకు 6 లక్షల యెన్లను జపాన్ ప్రభుత్వం బహుమతి గా ప్రకటించింది.
ఈ ఆలోచన వల్ల జననాల రేటు పెరిగి గాడిన పడుతుందని జపాన్ ఆలోచించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ప్రోత్సాహక బహుమతి కింద 6 లక్షలు యెన్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 4 లక్షలకు కంటే ఎక్కవ) ఇవ్వనుంది. అంతేగాక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుందని జపాన్ ప్రభుత్వం పేర్కొంది.
ఈ పథకాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా విధించింది. పెళ్లి చేసుకునే జంట మొదట వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, వారి వయసు 40 ఏళ్లకు మించి ఉండకూడదు. వార్షిక ఆదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ ప్రోత్సాహక బహుమతికి అర్హులుగా జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతేడాది దేశ వ్యాప్తంగా 8.65 లక్షల మంది మాత్రమే జన్మించడంతో రానురాను జననాల రేటు పడిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దేశంలో జననాల రేటును తిరిగి పెంచేందుకు జపాన్ ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రోత్సాహాకాన్ని ఆ దేశ యువతీ యువకులు ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారో, జననాల రేటు పెరుగుదలకు ప్రభుత్వ ప్రయత్నం తోడ్పడుతుందో లేదో వేచి చూడాలి.