జాతీయం: దిమ్మతిరిగే జయలలిత ఖజానా వెలుగులోకి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా ఆమె ఆస్తులు, పత్రాలను శుక్రవారం బెంగళూరులోని కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.
జయలలిత ఆస్తులు గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో భద్రపరచబడ్డాయి. తాజాగా, కోర్టు ఉత్తర్వుల మేరకు వాటిని తమిళనాడు ప్రభుత్వ అధికారులకు అప్పగించేందుకు అధికారులు భారీ భద్రత మధ్య ఏర్పాట్లు చేశారు.
ఈ ఆస్తుల జాబితాలో 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, వివిధ నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆరు ట్రంక్ పెట్టెల్లో భద్రంగా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ ఆస్తుల అప్పగింపు ప్రక్రియను న్యాయమూర్తి హెచ్‌ఎన్ మోహన్ పర్యవేక్షించారు. జయలలిత అక్రమార్జన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయబడింది. అప్పటి నుంచి ఆమె ఆస్తులు బెంగళూరులోనే భద్రపరచబడ్డాయి.
జయలలితకు వారసులమని భావిస్తున్న జె.దీపక్, జె.దీప అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఆస్తుల స్వాధీనం కోసం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు ఇప్పటికే వారి అభ్యర్థనను కొట్టివేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో వారు దాఖలు చేసిన అప్పీలు కూడా తిరస్కరించబడింది.
ఈ ఆస్తుల విలువను 2004లో ₹913.14 కోట్లుగా అంచనా వేశారు. కానీ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం, ఈ ఆస్తుల విలువు కనీసం ₹4,000 కోట్లకు పైగా ఉండొచ్చని అనధికారికంగా చెబుతున్నారు. ఈ తాజా పరిణామంతో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు మరో కీలక మైలురాయిని చేరుకుంది.