అనంతపురం: రేషన్ బియ్యం వివాదంలో పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పేర్ని నాని తన మంత్రిత్వ కాలంలో అనేక అరాచకాలకు పాల్పడ్డారని, తప్పుడు కేసులతో తనను టార్గెట్ చేశారని జేసీ ఆరోపించారు.
అంతేకాక, అనంతపురంలో నాని చర్యలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నాని చేసిన వ్యాఖ్యలపైనా జేసీ మండిపడ్డారు.
పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నానికెందుకు అంత ఆసక్తి? అని ప్రశ్నించారు. “పవన్ మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. లేకుంటే మీ పరిస్థితి మరోలా ఉండేది” అంటూ జేసీ హెచ్చరించారు.
జేసీ మరింతగా స్పందిస్తూ, చంద్రబాబు నియంత్రణ వల్లే వైసీపీ నేతలపై మర్యాద చూపుతున్నామని, అయితే వారి ప్రవర్తన మారకపోతే సమాధానం చెప్పడం తప్పదని సూచించారు.
గతంలో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవడం ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసింది. ఇప్పుడు ఈ వివాదం మళ్లీ రాజుకుని రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.