అమరావతి: దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ తదితర విద్యా సంస్థల్లో ప్రతి యేటా ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయి.
మార్చి 16వ తేదీ వరకు ఈ పరీక్షలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ రెండో విడత పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయినట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌ను 2021 నుంచి నాలుగు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 4 రోజుల చొప్పున మేలో 5 రోజుల పాటు ఈ పరీక్షలను కంప్యూటర్ పై నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గతంలో ప్రకటించింది.
ఇప్పటికే ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు మొదటి విడత పరీక్షలను నిర్వహించింది. ఆ సెషన్‌కు 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్చి సెషన్‌ను 15 నుంచి 18 వరకు నిర్వహించేందుకు తొలుత షెడ్యూల్ ఇచ్చారు. రెండో విడత పరీక్షలకు రిజిస్టర్ అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను మూడు రోజులకు కుదించారు. 16 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో 53 వేల మంది రెండో విడత పరీక్షలకు హాజరు అవనున్నారు. రాష్ట్రంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలలో పరీక్ష నిర్వహించనున్నారు.
కాగా ఈ పరీక్ష నిర్వహణలో కోవిడ్–19 నియమాలను పాటించేలా ఎన్‌టీఏ అన్ని చర్యలను చేపట్టింది. సిబ్బందితో పాటు పరీక్షలు రాసే వారంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను కూడా అందివ్వనున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ కూడా చేయిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు తమతో పాటు పారదర్శక బాటిళ్లలో ఉండే శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు.