మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌లో ఉన్న ఓ ప్లాస్టిక్ ట్రే గోదాంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు అధిక స్థాయిలో ఉండటంతో ఆపరేషన్‌కి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే, మంటలు వ్యాపిస్తున్నట్లు గుర్తించిన కార్మికులు వెంటనే బయటకు పరుగెత్తడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గోదాంలో భారీగా నిల్వ ఉన్న ప్లాస్టిక్, ఫైబర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలోనూ జీడిమెట్లలో ఇటువంటి అగ్నిప్రమాదాలు జరిగాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.