న్యూఢిల్లీ: ప్రపంచలోనే నం.1 కుబేరుడిగా మళ్ళీ అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బెజోస్ అపర కుబేరుడి టైటిల్‌ను బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం తిరిగి దక్కించుకున్నారు. జెఫ్ యొక్క ప్రస్తుత ఆస్తుల విలువ 191.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
దీని వల్ల ఈ మధ్య కాలంలో టాప్ బిలియనీర్‌గా అవతరించిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను దాటి ముందుకు వచ్చారు బెజోస్. నాలుగేళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన జెఫ్ బెజోస్ ఇటీవల నెంబర్ 2 స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. టెస్ల అధినేత ఎలాన్ మస్క్ దాదాపుగా ఆరు వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ బిలియనీర్ స్థానంలో కొనసాగారు.
ఇటీవల టెస్లా షేర్ల విలువ పతనమవడంతో మస్క్ ఆస్తుల విలువ సుమారు 4.6 బిలియన్ డాలర్ల మేరకు తగ్గింది. మంగళవారం టెస్లా షేర్లు మరో 2.4 శాతం వరకు కుప్పకూలాయి. టెస్లా షేర్లు జనవరి 26న ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి, ఆపై దాదాపు 10 శాతం వరకూ పతనమయ్యాయి.
అందువల్ల ఇప్పుడు ఎలాన్ మస్క్, కుబేరుల జాబితాలో మరోసారి రెండో స్థానానికి పరిమిత మైనారని బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఎలాన్ మస్క్ కన్నా 955 మిలియన్ డాలర్ల ఎక్కువ ఆస్తి బెజోస్ వద్ద ఉందని పేర్కొంది. మరోవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల బిట్ కాయిన్‌తో పాటు, మరో క్రిప్టో కరెన్సీ డోజ్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. 1.5 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించిన తరువాత, బిట్‌కాయిన్ విలువ 50 వేల డాలర్ల రికార్డు స్థాయిని దాటీ పరుగులు పెడుతోంది.