న్యూయార్క్: గ్లోబల్ ఈకామర్స్ మరియు టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రపంచ కుబేరుల్లో ఇప్పటికే తొలి స్థానంలో ఉన్న బెజోస్ వ్యక్తిగత సంపద బుధవారానికి 200 బిలియన్ డాలర్లను దాటింది. తద్వారా తొలిసారి 200 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను సాధించిన రికార్డును బెజోస్ సొంతం చేసుకున్నారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సంపద 116.1 బిలియన్ డాలర్లుగా కాగా, బెజోస్ సంపద 204.6 బిలియన్ డాలర్లకు చేరింది. బుధవారం అమెజాన్ షేరు దాదాపు 3 శాతం పెరిగి 3442 డాలర్ల వద్ద ముగిసింది. ఐతే కోవిడ్-19లోనూ అమెజాన్ షేరు 2020లో ఇప్పటివరకూ ఏకంగా 80 శాతం దూసుకెళ్లడం విశేషం! దీంతో అమెజాన్‌లో 11 శాతం వాటా కలిగిన కంపెనీ ప్రమోటర్ జెఫ్ బెజోస్ తాజా రికార్డును సాధించగలిగారు. డాలరుతో రూపాయి మారకపు విలువను 74గా పరిగణిస్తే, బెజోస్ సంపద రూ. 15 లక్షల కోట్లకుపైమాటే!
సియాటెల్‌లోని ఒక చిన్న గ్యారేజీలో పుస్తకాలను ఆన్లైన్లో విక్రయించేందుకు ప్రారంభమైన చిన్న ఈకామర్స్ కంపెనీ అమెజాన్, తరువాత పలు విభాగాలలో రకరకాల ప్రొడక్టులకూ విస్తరించింది. దీంతో ప్రస్తుతం రిటైల్ స్టోర్ల దిగ్గజం వాల్‌మార్ట్, తదితరాలకు ధీటైన పోటీనిస్తోంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు అమెరికన్ దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్, వైమానిక కంపెనీ బ్లూ ఒరిజిన్ తదితరాలలో పెట్టుబడులున్నాయి.
ట్రేడింగ్ ప్రణాళికలో భాగంగా ఈ ఆగస్ట్‌లో బెజోస్ 3.1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. అయినప్పటికీ 200 బిలియన్ డాలర్ల సంపదను అందుకోగలగడం విశేషం! వ్యక్తిగత విషయానికి వస్తే, 2019లో 38 బిలియన్ డాలర్లతో భార్య మెకింజీతో చేసుకున్న విడాకుల సెటిల్మెంట్ అత్యంత ఖరీదైనదిగా నిలిచిన విషయం విదితమే.