న్యూ ఢిల్లీ: గత కొన్నేళ్ళుగా టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరోసారి కొత్త రికార్డు నెలకొల్పింది. 4జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ వేగం విషయంలో జియోకు మరోసారి సాటిలేదని తేలింది. మే నెలకు గాను డౌన్‌లోడింగ్ స్పీడ్ లో ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే ఒక సెకనుకు సరాసరి 20.7 ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో జియో నెట్‌వర్క్ అందరికంటే ముందంజలో నిలిచిండి.
ఈ విషయాన్ని భారత టెలికాం రెగ్యూలేటర్ అయిన ట్రాయ్ తన ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా అప్‌లోడ్ స్పీడ్‌లో మాత్రం వోడాఫోన్ ముందంజలో నిలిచింది. వోడాఫోన్ దాదాపు 6.7 ఎమ్‌బీపీఎస్ అప్‌లోడింగ్ స్పీడ్‌ను నమోదు చేసింది. ట్రాయ్ జూన్ 8వ తేదీన ప్రచురించిన గణాంకాల ప్రకారం, వోడాఫోన్-ఐడియా మే నెలలో సగటున 6.3 ఎమ్‌బిపిఎస్ అప్‌లోడ్ వేగాన్ని కలిగి ఉండగా, దీని తరువాత రిలయన్స్ జియో 4.2 ఎమ్‌బీపీఎస్ వేగంతో, భారతి ఎయిర్‌టెల్ 3.6 ఎమ్‌బీపీఎస్ అప్‌లోడింగ్ స్పీడుని కల్గి ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది.
అయితే తాజాగా జియో 4జీ నెట్‌వర్క్ స్పీడ్ స్వల్ప పెరుగుదల కనిపించగా, వోడాఫోన్-ఐడియాతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికం. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కొన్ని ప్రాంతాల్లోనే 4జీ సేవలను ప్రారంభించింది. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ స్పీడ్‌ను ట్రాయ్ తన నివేదికలో తెలుపకపోవడం కొసమెరుపు. దేశ వ్యాప్తంగా రియల్ టైమ్ ప్రాతిపదికన నెట్‌వర్క్ స్పీడ్‌ను మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో ట్రాయ్ లెక్కిస్తుంది.