న్యూఢిల్లీ: మన దేశంలో టెలికాం రంగంలో ఒక్క సారిగా సంచలనం సృష్టించిన జియో మరో సంచలనానికి తెర తీయబోతున్నట్లు సమాచారం. అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించింది రిలయన్స్ జియో. దీనితో పాటు ఇప్పటికే చౌక ధరలో 5జీ మొబైల్స్ కూడా తీసుకొస్తున్నట్లు గతంలో జియో ప్రకటించింది.
కాగా తాజాగా ఇప్పుడు మరో కొత్త ప్రోడక్ట్ ను ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి తీసుకొనిరాబోతోంది. జియో త్వరలో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లను సైతం మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ల్యాప్ టాప్ కి సంబందించిన పనులు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. ‘జియో బుక్’ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌లను ఈ ఏడాది మే నాటికి తీసుకొచ్చే అవకాశం ఉంది.
జియో ఈ ల్యాప్‌టాప్ ను తక్కువ బడ్జెట్ లో కొత్త జియో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే విధంగా తయారు చేయనుంది. జియోబుక్ 4జీ ఎల్‌టీఈకు కూడా సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ జియోబుక్ నేరుగా సెల్యులార్ కనెక్షన్‌తో పనిచేసే విధంగా తయారీపై జియో ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. జియోబుక్ ల్యాప్‌టాప్ తయారీ కోసం జియో చైనా తయారీదారు బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సంస్థ ఇప్పటికే తన కర్మాగారంలో 5జీ జియోఫోన్ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు అనధికార సమాచారం.
జియోబుక్ స్పెసిఫికేషన్లు(కేవలం అంచనా మాత్రమే):
- జియోబుక్ 1,366క్ష్768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్‌టీఈ మోడెమ్‌తో డిస్ప్లేని కలిగి ఉంది. ల్యాప్‌టాప్ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ వాడనున్నారు. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది.
- ఒక మోడల్‌లో 2జీబీ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ తో పాటు 32జీబీ ఇఎంఎంసి స్టోరేజ్ ఉంది. మరో మోడల్‌లో 4జీబీ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 64జీబీ ఇఎంఎంసి 5.1 స్టోరేజ్ ఉంటాయి. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. జియో ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.