వాషింగ్టన్: జో బైడెన్ అమెరికా అద్యక్షుడి గా ప్రకటన ఇక లాంచనమేనా అన్నట్లు ఉన్నాయి ప్రస్తుత ఫలితాల ధోరాని. ఎందుకంటే అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్ (77) మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత కీలకమైన జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి.
శుక్రవారం తెలిసిన ఫలితాలను బట్టి ఇక్కడ కూడా బైడెన్‌ది పైచేయిగా ఉంది. జార్జియాలో 50 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ట్రంప్ ఉండగా, ఇప్పుడు ఇక్కడ బైడెన్ 1,579 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అదేవిధంగా, పెన్సిల్వేనియాలో ట్రంప్ కంటే బైడెన్ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా బుధవారం వరకు ట్రంప్ 70 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉండటం గమనార్హం.
ఈ తాజా పరిణామాలను అంచనా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారుల బృందాలు జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు విల్మింగ్టన్, డెలావర్‌కు తరలివెళ్లినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్ సర్వీస్ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా ఈ విభాగం అదనపు రక్షణ చర్యలు తీసుకుంటుంది.
గత వారం నుంచే బైడెన్ వెంట సీక్రెట్ సర్వీస్ బృందం ఒకటి రక్షణగా ఉంటున్నట్లు అమెరికా మీడియా అంటోంది. ఎన్నికల రోజున బైడెన్ వాహన కాన్వాయ్‌కి కూడా భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. భద్రతా విభాగం స్పందించడం కాస్త ఆలస్యమైనా ఈ పరిణామాన్ని తాము ముందుగానే ఊహించామని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.