వైసీపీ నుంచి కీలక నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు జోగి రమేష్ కూడా ఈ జాబితాలో చేరుతున్నట్లు సమాచారం. ఆయన అనుచరులు సోషల్ మీడియాలో “మా అన్న మారుతున్నాడు” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
జోగి రమేష్ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన జోగి, వైసీపీ హయాంలో మంత్రి పదవిని పొందారు. అంతకు ముందు చంద్రబాబుపై విమర్శలు చేయడమే కాకుండా, ఉండవల్లి నివాసంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవలి కాలంలో ఈ కేసు విచారణ వేగం పెంచడం, జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ భూముల కేసులో చిక్కుకోవడం, దీంతో ఆయన కొన్నాళ్లు జైలులో ఉండడం వంటి పరిణామాల వల్ల ఆయన వైసీపీ నుంచి దూరంగా వెళ్లే అవకాశాలపై చర్చ మొదలైంది.
జగన్‌కి నమ్మిన బంటుగా ఉన్న జోగి రమేష్, కేసుల్లో తీవ్రత పెరగడంతో పార్టీ మార్పు దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక కష్టకాలంలో జగన్ వెనుక నిలిచిన ఆయన ఇప్పుడు పార్టీని వీడి, జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జోగి రమేష్ గతంలో తాను చేసిన పనులన్నీ పార్టీ పెద్దలు చెప్పిందే అనుసరించానని, తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం.