అమరావతి: రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన జానీ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 21 సంవత్సరాల యువతిని లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలతో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ యువతి తనను 16 ఏళ్ల వయసు నుంచే జానీ మాస్టర్ వేధిస్తున్నారని, అతని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇప్పటికే జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతనిపై రిమాండ్ విధించినప్పటికీ, ఇటీవల రంగారెడ్డి కోర్టు జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు అందుకోవడం కోసం అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చారు.
అయితే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇవ్వాల్సిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలో, జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుని రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ రోజు రంగారెడ్డి కోర్టులో జరిగింది. అయితే కోర్టు ఈ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన యువతి తనని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ పీడిస్తున్నారని పోలీసులకు తెలిపింది.
ఇదే సమయంలో, జానీ మాస్టర్ విచారణలో బాధితురాలే తనను వేధించినట్టు చెప్పినట్లు సమాచారం. జానీ మాస్టర్ భార్య సుమలత కూడా ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేస్తూ ఆ మహిళ తన భర్తపై లేని ఆరోపణలు చేయడమే కాకుండా తన కుటుంబాన్ని ఐదేళ్లుగా నరకం చూపించిందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సుమలత నుంచి వివరణ కోరగా, ఆమె అందుకు హాజరై అన్ని ఆధారాలు అందజేశారు.
పోలీసులు ఇప్పటికీ జానీ మాస్టర్ పై ఉన్న మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. జానీ మాస్టర్‌కు ఈ నెల 8న దిల్లీలో జరగాల్సిన జాతీయ అవార్డు సమర్పణ కార్యక్రమానికి తాత్కాలికంగా ఆహ్వాన పత్రికను రద్దు చేసినట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది.