రంగారెడ్డి: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Choreographer Johnny Master) రంగారెడ్డి కోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు కేవలం ఐదు రోజులు మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్‌పై విడుదల కానున్నారు. నేషనల్ అవార్డును స్వీకరించేందుకు ఈ సమయంలో బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు వెల్లడించింది.
ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడా జైలులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అక్టోబర్ 6న ఆయన జైలు నుంచి విడుదలవుతారు. కాగా, జానీ మాస్టర్‌పై ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో, గత నెలలో గోవాలోని రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. గోవా కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని ఆయనను హైదరాబాద్ తరలించారు. అనంతరం రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ కేసులో కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, రంగారెడ్డి కోర్టు నాలుగు రోజుల కస్టడీ మంజూరు చేసింది. పోలీసులు నాలుగు రోజుల పాటు నార్సింగ్ స్టేషన్‌లో జానీ మాస్టర్‌ను విచారించారు. విచారణలో ఆయన, బాధితురాలే తనను వేధింపులకు గురిచేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇక జానీ మాస్టర్ భార్య సుమలత కూడా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు చేశారు. ఐదేళ్లుగా మహిళా కొరియోగ్రాఫర్ తన భర్తను మానసికంగా వేధించిందని, తాను ఆత్మహత్యాయత్నం చేయడానికి దారితీసేవిధంగా పురిగొల్పింది ఆరోపించారు. సుమలత తన ఫిర్యాదుతో పాటు ఆధారాలు కూడా ఫిల్మ్ ఛాంబర్‌కు అందజేశారు. దీంతో, ఫిల్మ్ ఛాంబర్ ఆమె నుంచి వివరణ కోరగా, నిన్న సుమలత కమిటీ ముందు హాజరై వివరణ అందించారు.
ఈ కేసు న్యాయపరంగా, ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా కూడా చర్చనీయాంశంగా మారింది. జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలు, కోర్టు తీర్పు, సుమలత ఫిర్యాదులు, మొత్తం అంశం ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ పరిశీలనలో ఉంది.