న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అయిన శ్రీ జేపీ నడ్డా (60) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన స్వయంగా తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ట్విటర్లో ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ లో సూచించారు. అయితే, ‘గెట్ వెల్ సూన్ సర్’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. జేపీ నడ్డా త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు మరియు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్ వేదికగా ఆశా భావం వ్యక్తం చేశారు.
ఇంకా బీజేపీ పార్టీ సీనియర్ నేతలు అయిన హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ గత నెలలో కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఇక గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 30,254 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98 లక్షల 50 వేలు దాటి కోటికి చేరువలో ఉంది.