ఆంధ్రప్రదేశ్: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణకు మరో కీలక పదవి దక్కనుందా? ఈ ప్రశ్న ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబుకు రమణకు మధ్య సుదీర్ఘకాలిక సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, టీటీడీ చైర్మన్ పదవికి రమణ పేరు మొదట వినిపించినప్పటికీ, తాజా బోర్డులో ఆయన పేరు లేకపోవడంతో ఈ ప్రచారం తగ్గింది.
అయితే, ప్రస్తుతం చంద్రబాబు దృష్టిని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)పై సారించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న చంద్రబాబు, ఆ క్రమంలో ఏపీఈఆర్‌సీ చైర్మన్ పదవికి జస్టిస్ ఎన్.వి. రమణను తీసుకురావాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ పదవిని కేబినెట్ హోదాతో కల్పించాలనే యోచన కూడా ఉంది.
వైసీపీ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నాగార్జున రెడ్డి ఈ చైర్మన్ హోదాలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ పదవి ఇప్పుడు ఖాళీ కావడంతో చంద్రబాబు తన దృష్టిని జస్టిస్ రమణవైపు మార్చినట్లు భావిస్తున్నారు.
చంద్రబాబు తన విజన్‌ను అమలు చేయడానికి రమణను సరైన వ్యక్తిగా అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు ఆలోచనలకు రమణను సపోర్ట్ చేయవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.