హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతూ, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్‌ను విడుదల చేయకుంటే తాను కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) వేస్తానని హెచ్చరించారు. కేఏ పాల్ మాట్లాడుతూ, రాజకీయ నేతలతో పోలిస్తే నటులు, సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
చంద్రబాబు నిర్వహించిన పుష్కరాలు, కందుకూరు, గుంటూరులో జరిగిన ర్యాలీల్లో అనేక మంది మరణించినప్పటికీ, ఆయనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
“23 మంది పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోతే చంద్రబాబును అరెస్ట్ చేయలేదా? అల్లు అర్జున్ పట్ల ఈ విధమైన చర్యలు ఎందుకు?” అని నిలదీశారు.
“ప్రజలందరికీ చట్టం సమానంగా ఉండాలి. ఇలాంటివి తక్షణమే నిరసించాలి,” అని కేఏ పాల్ అన్నారు. అల్లు అర్జున్ కేసు త్వరగా సానుకూలంగా పరిష్కారమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.