ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణలోని పదిమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కేసులు పెట్టిన నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంపేస్తామని హెచ్చరిస్తున్నారని, ఓ నేత తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటి వరకు తనను బెదిరించిన వారెవరూ సురక్షితంగా లేరని చెప్పిన పాల్, తనకు దేవుడే రక్షణ అని అన్నారు. కేవలం ప్రజల కోసం తాను చేస్తున్న పనులపై కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానని, అలాంటి బెదిరింపులు తనను ఏమాత్రం భయపెట్టవని స్పష్టం చేశారు.
గ్రూప్-1 పరీక్షల డిమాండ్‌ను సపోర్ట్ చేస్తూ, విద్యార్థులకు రెండు నెలలు సమయం ఇవ్వడంలో ఏమాత్రం నష్టం లేదని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి తాను సలహాలు ఇస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని జోస్యం చెప్పారు.
చంద్రబాబు పైనా నిప్పులు చెరిగిన కేఏ పాల్, బాబు రావాలి జాబు రావాలని నినాదం చేసేటప్పుడు, ఆయన వస్తే ఎలాంటి మార్పు ఉండదని అప్పుడే చెప్పానని అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.