చెన్నై: త్వరలో తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన మూడో రాజకీయ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘మక్కల్ నీది మయ్యం’(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు మరియు విలక్షణ నటుడు అయిన కమల్‌హాసన్ పేరు ఖరారైంది.
ఇదిలా ఉండగా సీట్ల పంపకంలో సయోధ్య కుదరక ఏఐఏడీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు డీఎండీకే అధికారికంగా ప్రకటించింది. దీంతో డీఎండీకేని మూడో కూటమిలో చేర్చుకునేందుకు కమల్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్నాడీఎంకే కూటమిలో కొనసాగిన ‘ఇండియా జన నాయక కట్చి’(ఐజేకే) గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమితో కలిసింది.
కాగా ఐజేకే వ్యవస్థాపక అధ్యక్షుడు పారివేందర్ పెరంబలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నుంచి 1, 2 స్థానాలు మాత్రమే దక్కే పరిస్థితి ఎదురవడంతో వారు ఆ కూటమి నుంచి బయటకొచ్చారు. తన కుమారుడు రవి పచ్చముత్తును పార్టీ అధ్యక్షునిగా చేసి మూడో కూటమి సన్నాహాలు మొదలుపెట్టారు.
సీట్ల సర్దుబాటు విషయమై ఎటువంటి పిలుపు అందకపోవడంతో అలిగిన ‘సమత్తువ మక్కల్ కట్చి’ అధ్యక్షుడు శరత్‌కుమార్ అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకే కూటమిలో చేరిపోయారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మినహా మరే కూటమిలోనైనా చేరేందుకు ఎదురుచూస్తున్న కమల్ హాసన్ ఇక ఈ కూటమిలో చేరారు.
కమల్ ను ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు శరత్‌కుమార్ ప్రకటించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఎంఎన్‌ఎం 154, ఎస్‌ఎంకే, ఐజేకే చెరో 40 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ప్రజలకు విరోధులుగా వ్యవహరించే ప్రతి ఒక్కరినీ తాము లక్ష్యంగా చేసుకుంటామని కమల్ ఈ సందర్భంగా ప్రకటించారు.