మూవీడెస్క్:బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ప్రస్తుతం తన సినిమాలతో పాటు కొత్త వ్యాపారాల్లో కూడా బిజీగా ఉన్నారు.
ఇటీవలే ఆమె నటించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ పొందింది.
ప్రస్తుతం మాధవన్‌తో ఓ సినిమా చేస్తుండగా, హిమాలయాల్లో ది మౌంటైన్ స్టోరీ పేరుతో క్యాఫే ప్రారంభించనున్నారు.
అయితే ఇదే సమయంలో ఆమె చట్టపరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనాపై పరువు నష్టం కేసు వేశారు.
ఈ కేసులో కోర్టు హాజరు మినహాయింపు కోరుతూ ఆమె పిటిషన్ వేశారు కానీ, అది కొట్టివేయబడింది.
అయితే, కోర్టు సమన్లను పలుమార్లు ఉల్లంఘించడంతో, ముంబై బాంద్రా కోర్టు ఆమెకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.
కంగనా తరపు న్యాయవాది ఆమె పార్లమెంటరీ పనులతో బిజీగా ఉండటంతో కోర్టుకు హాజరు కాలేదని వివరణ ఇచ్చారు. కానీ కోర్టు చివరి అవకాశం ఇచ్చింది.
ఆమె మరోసారి కోర్టుకు హాజరు కాకుంటే నాన్-బెయిలబుల్ వారెంట్ ఖాయం అనే టాక్ ఉంది.
2016లో కంగనా, జావేద్ అక్తర్ మధ్య మొదలైన వివాదం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సమయంలో మరింత ముదిరింది.
కంగనా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ జావేద్ పరువు నష్టం కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.