బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో తొలి ఘట్టం పూర్తవగానే తెర మీదకు మరో ముఖ్య ఘట్టం కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై కొత్త కేబినెట్‌లో పదవుల కోసం ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఢిల్లీలోనూ సదరు నేతలు ఇప్పటికే మకాం వేసి జాతీయ ముఖ్య నేతలను ప్రసన్నం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే క్రితం కేబినెట్‌లో ఉన్న పది మందికి పైగా మంత్రులకు పదవి గండం తప్పేలా లేదు. నూతన కేబినెట్ లో కొత్తవారికి మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీ మూలాలు ఉన్నవారికే పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
యడియూరప్ప మంత్రివర్గంలో పని చేస్తున్న సీనియర్ మంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, సురేశ్ కుమార్, సీసీ పాటిల్, కోటా శ్రీనివాస పూజారి, శశికళా జొల్లె తదితరులకు పదవి నిలబడకపోవచ్చని సమాచారం. ఇంతకుముందు కాంగ్రెస్ మరియు జేడీఎస్ పార్టీల నుండి వలస వచ్చిన 15 మంది వరకూ యడియూరప్ప మంత్రి అవకాశాలు కల్పించారు.
కాగా ఈ ఆదివారంలోగా మంత్రుల పేర్లు ఖరారు చేసి కేబినెట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బసవరాజ్ ఉన్నట్లు వినికిడి. కాగా ఈ మంత్రివర్గ కూర్పు మొత్తం జాతీయ బీజేపీ నాయకత్వం చేతుల్లోనే ఉంది.