బయోపిక్స్ కొత్తవి కావు. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, మేరీ కోమ్, మిల్కా సింగ్ (భాగ్ మిల్కా భాగ్), మహావీర్ సింగ్ ఫోగట్ (దంగల్) ల మీద తీసిన బయోపిక్స్ సంచలన విజయాలు సాధించాయి. టాలీవుడ్ లో జెర్సీ వంటి చిత్రాల తరువాత, స్పోర్ట్స్ డ్రామా మరియు జీవిత చరిత్రలను కూడా వీక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. కరణం మల్లేశ్వరి బయోపిక్ కూడా ఈ లిస్టులోకి చేరుతుంది.
2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి, ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన కరణం మల్లేశ్వరిపై రచయిత, నిర్మాత కోన వెంకట్ ఈ రోజు బయోపిక్ ప్రకటించారు. ఆమె ఒలింపిక్ పతకం సాధించిన ఏకైక భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ కూడా. ఆమె ప్రయాణం ఇప్పుడు చలన చిత్రంగా మారుతోంది. కోన వెంకట్ రచన మరియు సహ నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ చిత్రానికి ఎంవివి సత్యనారాయణ నిర్మాత. సంజన రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ రోజు కరణం మల్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనుంది. ఈ చిత్రానికి కథానాయిక ఇంకా ఖరారు కాలేదు. కరణం మల్లేశ్వరి పాత్రలో టాప్ నటి నటించే అవకాశం ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది.
మార్చిలో ఏసిఅన్ ఏజ్ పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, వెంకట్ ఈ ప్రాజెక్ట్ గురించి మరియు మల్లేశ్వరి కథను ఎందుకు చెప్పాలనుకునాడో వివరించారు. “ఈ చిత్రం ప్రస్తుత తరానికి ప్రేరణగా నిలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఒక పేద అమ్మాయి ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించింది. ఇది ఖచ్చితంగా వివరించడానికి పెద్ద కథ” అని అన్నారు.
“ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె చాలా అడ్డంకులు మరియు సమస్యలను ఎదుర్కొంది. ఇది అంత సులభం కాదు. ఆమె తన మొత్తం కథను మాకు చెప్పింది మరియు ఆమె జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను చిత్రీకరించడానికి మాకు అనుమతి ఇచ్చింది, ”అన్నారాయన. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెంకట్ తెలిపారు.
ప్రఖ్యాత నటులు సీనియర్ ఎన్.టి.ఆర్ మరియు సావిత్రి చిత్రాల తర్వాత తెలుగు పరిశ్రమ నుండి ఇది మూడవ అతిపెద్ద బయోపిక్ అవుతుంది.