కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సినిమా రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇకపై సినిమా టికెట్ ధరలు గరిష్టంగా ₹200 కంటే ఎక్కువగా ఉండకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. సింగిల్ స్క్రీన్‌లే కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్లకు కూడా ఇది వర్తించనుండటంతో, పాన్ ఇండియా సినిమాల ప్రదర్శనకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ నిర్ణయంతో మల్టీప్లెక్స్ థియేటర్లు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కన్నడ సినీ ప్రముఖులు పెద్దగా హాజరుకాకపోవడం ప్రభుత్వానికి అసంతృప్తిని కలిగించిందని భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేయగా, కొద్ది రోజుల్లోనే టికెట్ ధరల నియంత్రణ ఆమోదం పొందడం విశేషంగా మారింది.
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చిన్న సినిమాలకు పెద్దగా సమస్య రాకపోయినా, భారీ బడ్జెట్ సినిమాలకు ఇది నష్టం కలిగించే అవకాశం ఉంది. కేజీఎఫ్, కాంతారా వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. అయితే, ఇప్పుడు టికెట్ ధర పరిమితితో థియేటర్లలో ఆదాయంపై ప్రభావం పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయం మరిన్ని సమస్యలకు దారి తీసే అవకాశముంది. గత ఏడాది కన్నడలో 100కిపైగా థియేటర్లు మూతపడగా, ఇప్పుడు మరికొన్ని థియేటర్లు వ్యాపారంగా మారే అవకాశముందని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నిబంధన వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఇది ఇండస్ట్రీపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.