బెంగళూరు: దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ సోమవారం అసెంబ్లీకి ఎద్దుల బండిపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అలాగే సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు పెద్ద ఊరేగింపుగా వెళ్ళారు. దేశంలో కోవిడ్ కష్ట కాలాల పరిస్థితుల్లోనూ ప్రభుత్వం పేదలపై భారం వేస్తోందని వారు దుయ్యబట్టారు.
తమ ఎద్దుల బండి పోరాటం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించగలిగామని వారు తెలిపారు. భారీ సందోహంతో వారు అసెంబ్లీకి రావడంతో విధాన సౌధ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనిని నిలువరించడానికి వందలాది పోలీసులు మోహరించారు, దీనితో అక్కడ పెద్ద గందరగోళం ఏర్పడింది.
కర్ణాటక శాసనసభా వర్షాకాల సమావేశాలలో తొలి రోజైన సోమవారం ఇటీవల గతించిన రాజకీయ, సామాజిక ప్రముఖులకు సంతాపాన్ని తెలిపింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాగానే సభాధ్యక్షుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి సంతాప తీర్మానాన్ని ప్రకటించారు.