బెంగళూరు: కర్ణాటకలో అన్‌లాక్–4 వెసులుబాట్లు అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో గత మూడు నెలల నుండి మూసి ఉంచిన సినిమా థియేటర్లను 50 శాతం సీట్లతో తెరుచుకోవడానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. వాటితో పాటు డిగ్రీ మరియు ఆపై ఉన్నత విద్యా సంస్థలను తెరవడానికి కూడా అనుమతిచ్చింది.
ఈ ఆదివారం కావేరి నివాసంలో సీఎం యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సీనియర్ మంత్రుల సమావేశంలో థియేటర్లు విద్యాసంస్థలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కోవిడ్ సెకెండ్ వేవ్ ఉఢృతితో రాష్ట్రం మొత్తం మీద సినిమా థియేటర్లకు తాళాలు పడ్డాయి. అలాగే రాష్ట్రంలో స్కూళ్లు, కళాశాలలను కూడా బంద్ చేశారు.
ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసులు కాస్త అదుపులోకి రావడం వల్ల అన్‌లాక్– 4కు తలుపులు తీశారు. దీని వల్ల ఈ రోజు నుంచి సగం మంది ప్రేక్షకులతో సినిమా థియేటర్‌లను నడుపుకోవచడానికి అనుమతించింది. అలాగే ఇక ఈ నెల 26వ తేదీ నుండి డిగ్రీ, పీజీ తదితర కాలేజీలను తెలుసుకోవచ్చు.
కాగా విద్యాసంస్థలకు వచ్చే విద్యార్థులు అందరూ కనీసం ఒక్క మోతాదైనా కోవిడ్ టీకా వేయించుకుని ఉండాలనే నిబంధన పెట్టింది. అయితే ప్రస్తుతానికి పబ్, క్లబ్ మరియు ఈత కొలనుల మూసివేత మాత్రం కొనసాగనుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు.
అయితే రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో కూడా కోవిడ్ నిబంధనలను సడలించాలని సర్కారు నిశ్చయంతో ఉంది. లాక్‌డౌన్ కాలంలో ఇంటికే పరిమితం అయిన చాలా మంది ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళి సేద తీరాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాగే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉండడంతో పర్యాటక కేంద్రాల్లో విశ్రాంతి తీసుకుంటూ తమ పని చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రారంభానికి కూడా ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కే.సుధాకర్ ట్వీట్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఆయుష్, దంతవైద్య, పారా మెడికల్ కాలేజీలను కూడా తెరుచుకోవచ్చని తెలిపారు. కోవిడ్ టీకా వేయించుకున్న విద్యార్థులు, బోధన సిబ్బంది మాత్రమే కళాశాలకు హాజరు కావాలని తెలిపారు. కాగా మూడో వేవ్‌కు ముందు జాగ్రత్తగా ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లల చికిత్సలకు అన్నీ ఏర్పాట్లు ఉసిద్ధం చేసినట్లు కూడా తెలిపారు.