చెన్నై: తమిళనాట సూర్య శివకుమార్, కార్తీ శివకుమార్ బ్రదర్స్ సినిమాల్లో ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారో ప్రజా సేవలో కూడా అలాగే ఉన్నారు. సినిమాలు పంచుకున్నట్టే సమాజ సేవని కూడా పంచుకుంటున్నారు. అన్న సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువుల కోసం కష్టపడుతుంటే తమ్ముడు కార్తీ ‘ఉళవన్’ ఫౌండేషన్ ద్వారా రైతులకి సేవలు అందింస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో కేవలం తమిళనాడు లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు చేసే సహాయం అభినందనీయం.
హీరో కార్తి రైతుల కోసం ‘ఉళవన్’ అనే ఫౌండేషన్ స్థాపించాడు. వారి కోసం పలు కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా రూ.4లక్షలను ఖర్చు చేసి ఉద్రపురం తిరునెల్ వెలి జిల్లాలోని సూరపల్లి కాలువను శుభ్రం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్తి తాజాగా 10వేల ఎకరాల భూమిని కాపాడారు.ఈ కాలువ ద్వారా 10 గ్రామాల్లోని దాదాపు 10వేల ఎకరాల భూమికి నీరు అందనుంది. దీంతో కార్తి చేసిన పనిపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రభుత్వాలే రైతులను పట్టించుకోని ఈ పరిస్థితుల్లో హీరో కార్తి చేసిన మేలుపై రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గతంలో కూడా కార్తి చాలా మంది రైతులకు సాయం చేశారు. ఇలా ఒక్కొక్కరు తమకి తోచిన దాన్లో తమకి తెలిసిన సమస్యలకి ఎంతో కొంత పరిష్కారం చూపిస్తే అందరూ ఆనందంగా ఉంటారు.