టాలీవుడ్: ‘లింగోచ్చా‘ అనే టైటిల్ తోనే చాలా మంది చూపుని తమ వైపు ఆకర్షించగలిగారు సినిమా టీం. చాలా మందికి ఈ పదానికి అర్ధం తెలియదు. అదేమిటి అని తెలుసుకోవడానికి అయిన ఈ సినిమా గురించి ఒక లుక్ వేస్తారు అనే ప్రయత్నం ఈ సినిమా టీం చేసింది అని చెప్పవచ్చు. సరిగ్గా చెప్పాలంటే ‘లింగోచ్చా’ అంటే ఒక ఆట, కొన్ని ఏరియాల్లో దీన్ని ‘పల్లీ’ అని ‘ఏడు పెంకులాట’ అని ‘సెవెన్ స్టోన్స్’ అని రకరకాలుగా పిలుస్తారు. ఓల్డ్ సిటీ ఏరియా లో దీని పేరు ‘లింగోచ్చా’. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా అదే ఎంచుకున్నాడు ఈ డైరెక్టర్. అలాగే సినిమా కూడా పీరియాడిక్ గా జరిగిన కథ రాసుకున్నట్టు టీజర్ ని చూస్తే అర్ధం అవుతుంది. ‘లింగోచ్చా’ – గేమ్ అఫ్ లవ్ అనే టాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ని ‘ఫలక్ నమా దాస్’ విశ్వక్సేన్ విడుదల చేసారు.
కేరాఫ్ కంచెరపాలెం లో జోసెఫ్ గా నటించిన ‘కార్తీక్ రత్నం’ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బ్లాక్ బాక్స్ స్టూడియోస్ సమర్పణలో శ్రీకళ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్వతహాగా హైదరాబాదీ అయిన డైరెక్టర్ ఆనంద్ ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన లింగోచ్చా గేమ్ నేపథ్యంలో కొన్ని యదార్ధ సంఘటనలు ఇచ్చిన స్పూర్తితో ఒక లవ్ స్టోరీ రాసుకుని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే దాదాపు ఫలక్నుమా దాస్ పోలికలు కనిపిస్తాయి. టీజర్ లో మొత్తం హీరో పాత్ర, అతను ఉండే వాతావరణం మొత్తం ఓల్డ్ సిటీ ని బేస్ చేసుకొని చూపిస్తాడు. ఇది చాలా వరకు ఫలక్నుమా దాస్ ని పోలి ఉంటాయి. ఇందులో కార్తీక్ రత్నం ‘ధగడ్ శివ’ పాత్రలో కనిపిస్తున్నాడు. టీజర్ వరకు కార్తీక్ రత్నం బాగానే ఆకట్టుకున్నాడు.