ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో కశ్మీర్‌పై చర్చ భారత విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఇంటర్నేషనల్ డెస్క్: ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో (Oxford University) కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి అంశంపై చర్చ తీవ్ర వివాదానికి దారితీసింది. శుక్రవారం ఆక్స్‌ఫర్డ్ యూనియన్ డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో కొన్ని వ్యాఖ్యలు భారత విద్యార్థుల ఆగ్రహాన్ని రగిలించాయి.
వివాదాస్పద వ్యాఖ్యలు
డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్, జఫార్‌ఖాన్ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు (Jammu Kashmir) స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాల్సిందే అని వారు వ్యాఖ్యానించడంతో భారత విద్యార్థులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేతలకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయనే ఆరోపణలను వారు తెరపైకి తెచ్చారు.
విద్యార్థుల నిరసనలు
ఠాకూర్, జఫార్‌ఖాన్‌లపై తీవ్ర విమర్శలు చేస్తూ భారత విద్యార్థులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ‘‘ఆక్స్‌ఫర్డ్ యూనియన్ తరచూ ఇలాంటి వ్యక్తుల ప్రసంగాలకు వేదికగా మారుతోంది’’ అంటూ నినాదాలు చేశారు. జమ్మూ కశ్మీర్ ఇప్పుడూ.. ఎప్పుడూ భారత్‌లో భాగమేనని స్పష్టం చేశారు.
చరిత్రను ఉద్ఘాటించిన విద్యార్థులు
1984లో లండన్‌లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రేను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన వెనుక జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) ఉందని చెప్పుకొచ్చారు. అలాంటి నేతలను ఆహ్వానించడం వేదికను అవమానించడమేనని విద్యార్థులు ఆరోపించారు.
వ్యాఖ్యాతల నేపథ్యం
ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్ ‘‘వరల్డ్ కాశ్మీర్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్’’ను స్థాపించారు. ఆయన తండ్రితో కలిసి ‘‘మెర్సీ యూనివర్సల్’’ అనే సంస్థను ప్రారంభించారు. ఈ రెండు సంస్థలకూ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఎఫ్‌బీఐ (FBI) సహా యూకే నిఘా సంస్థలు దర్యాప్తు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.