ఏపీ: సీఐడీ నమోదు చేసిన మద్యం కుంభకోణ కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేయగా, వాటిని సవాల్ చేస్తూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే కోర్టు నోటీసుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టంగా తెలిపింది. దీంతో కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ ఇచ్చిన నోటీసులకు కసిరెడ్డి ఎదురు నిలబడినప్పటికీ, కోర్టు తక్షణ జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. సాక్షిగా విచారణకు హాజరుకావడంలో తప్పులేదని పేర్కొంది. ఈ కేసులో కసిరెడ్డి పాత్రపై మరింత విచారణ సాగనుంది.
ఇదే కేసులో మరో వైసీపీ నేత, తిరుపతి ఎంపీ మిథున్ రెడ్డికి కూడా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది.
సీఐడీ తరఫున న్యాయవాది వాదిస్తూ, మిథున్ రెడ్డిని ఇప్పటివరకు నిందితుడిగా నమోదు చేయలేదని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితిలో బెయిల్ అవసరం లేదన్నారు.
గత ఏడాది సెప్టెంబర్ 23న సీఐడీ ఈ మద్యం కుంభకోణం కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసులో రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. మద్యం ఎక్సైజ్ విధానాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో మరోమారు వైసీపీ నేతలకు హైకోర్టు నుంచి నిరాశే ఎదురవ్వడంతో రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది.