వాషింగ్టన్: చివరి ఓటు లెక్కించే వరకు విజేత ఎవరో చెప్పలేమన్నట్లు, ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీళకమైనది. అందుకే ఎన్నికల్లో ఓటు వేయడానికి రాలేని వారికి, సుదూర ప్రాంతాలలో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తాయి ప్రభుత్వాళు.
ప్రస్తుతం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమెరికన్ మహిళా వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతరిక్ష కేంద్రం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నవంబర్ 3వ తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆమె అప్పుడే తన ఓటును వేసేశారు. ఓటింగ్ జరిగే రోజున తాను స్పేస్ లోనే ఉంటానని అందుకే ఓటు వేసినట్లు రూబిన్స్ చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోను నాసా ట్విట్టర్ లో షేర్ చేసింది. అంతరిక్ష కేంద్రం నుంచి నేను ఈ రోజు ఓటు వేశాను అని రూబిన్స్ ఆ ట్వీట్‌లో తనుపేర్కొంది.
ఈ నెల 14వ తేదీన అంతరిక్షంలోకి ప్రవేశించిన రూబిన్స్ ఆరు నెలల పాటు అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకే ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తన ఓటు హక్కును వినియోగించుకుంది. అయితే అంతరిక్షం నుంచి ఓటు వేసే సదుపాయాన్ని 1997 నుంచి నాసా కల్పించింది. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే వీరందరూ ఫెడరల్ పోస్ట్ కార్డు ఆప్లికేషన్ ద్వారా అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1997లో మొదటిసారి డేవిడ్ వోల్ఫ్ అనే వ్యోమగామి అంతరిక్షం నుంచి ఓటును వేశారు.