హైదరాబాద్: పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామా చేసిన ఆయన టీఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆయనకు గులాబీ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానం పలికారు. కౌశిక్ రెడ్డితో పాటు తన అనుచరులు పెద్ద సంఖ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న ఆయన అక్కడ జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేసారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి నాకు చిరకాల మిత్రుడన్నారు.
అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పని చేశారని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికే కౌశిక్‌రెడ్డి తమ పార్టీలో చేరారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సలహాతో ఉద్యమాన్ని నడిపాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమాన్ని కొనసాగించాం. ప్రజాస్వామ్యంలో పార్టీలు గెలవడం, ఓడడం నిరంతర ప్రక్రియ అని ఎప్పుడూ శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు అన్నారు.