హైదరాబాద్: ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, టీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 672 ఓట్ల భారీ మెజారిటీ ఘనవిజయం సాధించి ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.
బరిలో నిలిచిన బీజేపీ, కాంగ్రెస్ పార్టిల అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోయింది. 728 (88%) మొదటి ప్రాధాన్యత ఓట్లు కవితకే దక్కాయి. ఇక రెండోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి పోతనకర్ లక్ష్మీనారాయణకు 56 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వి.సుభాష్ రెడ్డికి కేవలం 29 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
అయితే పోలైన ఓట్లలో పది ఓట్లు చెల్లలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 9న జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, ఉదయం 10.30 గంటలకల్లా ఫలితం వెలువడింది. ఎన్నికల సంఘానికి నివేదించిన అనంతరం కల్వకుంట్ల కవితకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు.