హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మరియు కేంద్ర మాజీ మంత్రి అయిన రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ ఇవాళ మరణించారు. ఫెర్నాండెజ్ జూలై చివరలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో మంగళూరులోని ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అయితే అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఫెర్నాండెజ్.
ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రోజున తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండెజ్ మృతిపై సదరు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటనను విడుదల చేసింది. ఇంకోవైపు ఫెర్నాండేజ్ మృతి పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు.
ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో ఆయన రోడ్డు రవాణా & హైవే, కార్మిక, మరియు ఉపాధికల్పన శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు.
తొలి యూపీఏ ప్రభుత్వంలోని కేబినెట్‌లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని, ఆయన చేసిన సేవలు మరువలేని అని అన్నారు. వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.