న్యూఢిల్లీ : తీవ్ర వివాదం రేపిన రైతు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుండి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ రోజు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం రైతులపై ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 8న రైతు సంఘాలు భారత్ బంద్‌కు ఇచ్చిన పిలుపుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. భారత్ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.
రైతుల భారత్ బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల పోరాటం న్యాయబద్ధమైనది, వారి డిమాండ్స్‌కు టీఆర్‌ఎస్ పార్టీ మద్దతినిస్తుందని ఆదివారం ఓ ప్రకటన ద్వారా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు జరిగాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు.