న్యూఢిల్లీ: దాదాపు 20 ఏళ్ళ చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో తమ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకొని దేశ రాజకీయాల్లో ముద్ర వేసేందుకు సన్నద్ధమైంది. ఆ పార్టీ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచే ఈ భవన నిర్మాణానికి ఆ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి భూమి పూజ నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 1:48 గంటలకు భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఢిల్లీ వసంత్ విహార్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రం జరుగగా దీనికి తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య పార్టీ నేతలంతా పాల్గొన్నారు.
వసంత్ విహార్ లోని భవన నిర్మాణ స్థలంలో వేద పండితులు గురువారం ఉదయం 11 గంటల నుండే శాస్త్రోక్తంగా పూజలు మొదలు పెట్టారు. మధ్యాహ్నం 1:14 గంటల సమయంలో సీఎం అక్కడికి చేరుకున్నారు. భూమిపూజకు ముందు జరిగిన హోమంలో కేసీఆర్, కేటీఆర్‌లు పాల్గొన్నారు. 2022 దసరాలోగా 1,100 చదరపు మీటర్ల స్థలంలో భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా ఈ భవన నిర్మాణం పూర్తయితే, దేశ రాజధానిలో పార్టీకి సొంత కార్యాలయ భవనం నిర్మించుకున్న అతికొద్ది ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్‌ఎస్ పార్టీ చేరుతుంది. అయితే ఢిల్లీలో గత మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, కానీ పూజా కార్యక్రమం మొదలయ్యే సమయానికి వర్షం తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నారు.