తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ కీలక పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు కేసీఆర్, జగన్‌లు జనవరి నుంచి ప్రజల మధ్యకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
ఎన్నికల పరాజయాల తర్వాత ఇరు నేతలు దాదాపు రాజకీయ వేదికలకు దూరంగా ఉంటూ, పార్టీల భవిష్యత్తుపై విమర్శలతో సతమతమవుతున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఏడాది కాలంగా చాలా తక్కువసార్లు మాత్రమే బహిరంగంగా కనిపించారు. బడ్జెట్ సమావేశాలు, ప్రాజెక్టుల పర్యటనలతో మాత్రమే ప్రజల ముందుకు వచ్చి, తిరిగి ఇంటికే పరిమితం అయ్యారు.
అయితే, పార్టీకి ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల నాయకత్వంలో కొంతబలం ఉందని చెప్పుకోవచ్చు.
మరోవైపు, వైసీపీ అధినేత జగన్ ఎన్నికల తర్వాత ప్రజల మధ్యకు రావడంలో విఫలమయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీలో లేకపోవడం, కేవలం మీడియా సమావేశాలతో సరిపెట్టడం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చిందని విమర్శలు వస్తున్నాయి.
అయితే, జనవరి నుంచి ప్రజల మధ్యకు వెళ్లేందుకు జగన్ పలు నియోజకవర్గాల వారీగా వైసీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కూడా సంక్రాంతి తర్వాత ప్రత్యేక ప్రణాళికతో జనంలోకి వెళ్లనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి ఇరు నేతలు తమ జన పర్యటనలతో రాజకీయ సమీకరణాలను మార్చగలరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.