తెలంగాణ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చాన్నాళ్ల తర్వాత బహిరంగంగా తన గళాన్ని విప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఎర్రవల్లిలోనే ఉంటూ నేతలను వ్యక్తిగతంగా కలుస్తున్న ఆయన, తాజాగా పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు.
శుక్రవారం మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ను కలవగా, ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం గతంలో పోరాడినట్లుగానే ఇప్పుడు ప్రజా హక్కుల కోసం మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలవడం లేదని, రైతు బంధును ఆపడం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయారని దుయ్యబట్టారు. ముస్లింలను ఓట్ల కోసం వాడుకున్న కాంగ్రెస్, గురుకుల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోతలు, నీటి సమస్యలు మొదలయ్యాయని, సంగేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టులకు టెండర్లు ఎందుకు పిలవలేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఇకపై నేరుగా పోరాట బాట పడాల్సిందేనని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హరీశ్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.