బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్లీ ప్రజలలోకి రావడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తిచేసిన నేపథ్యంలో కేసీఆర్ పునర్‌ప్రవేశం కోసం భారీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా ఫాంహౌజ్‌కే పరిమితమైన ఆయన, త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన కేసీఆర్, బలమైన వ్యూహంతో ప్రజా పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రైతుల రుణమాఫీపై అసంతృప్తి, నిరుద్యోగ యువత సమస్యలు, మహిళల పట్ల ప్రభుత్వ ఉపేక్ష వంటి అంశాలపై ఆయన ప్రస్తావన చేయనున్నట్లు సమాచారం.
ఇటీవల అనేక మంది రైతులు రుణమాఫీ ఆలస్యం వల్ల నిరసనలు చేపట్టగా, కొంతమంది ఆత్మహత్యాయత్నాలు చేయడంపై కేసీఆర్ స్పందించలేదు. అదే విధంగా, హైదరాబాదులో అక్రమ కట్టడాల తొలగింపు, మూసీ నది ప్రాజెక్టు పరిధిలో ప్రజల పునరావాసంపై కూడా స్పందించకపోవడం విమర్శలకు దారి తీసింది.
తాజాగా, ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలను బలోపేతం చేయడంపైన కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. రాబోయే నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపే సన్నద్ధతలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.