హైదరాబాద్: తెలంగాణ యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొని కేంద్ర వైఖరిని ప్రశ్నించారు.
దేశ మరియు రాష్ట్ర రైతుల సమస్య తీర్చడంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకునే బహుముఖ లక్ష్యాలతో సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఈ దీక్షను తలబెట్టినట్లు తెలుస్తోంది.
ఈ దీక్షలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. భారత ప్రధాని మోదీని గద్దె దించే సత్తా రైతులకు ఉందని ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో ప్రధానిని హెచ్చరించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూకల బియ్యం పెట్టమని పీయూష్ గోయల్ అన్నారని ధ్వజమెత్తారు. ధర్మబద్ధమైన డిమాండుతో తామొస్తే.. పీయూష్ గోయల్ అవమానించారని మండిపడ్డారు. ఆయన పీయూష్ గోయల్ కాదని, పీయూష్ గోల్మాల్ అని వ్యాఖ్యానించారు.