కేసీఆర్‌కు హైకోర్టు రిలీఫ్: రైల్ రోకో కేసు కొట్టివేత
తెలంగాణ: ఉద్యమ నాయకుడిగా పేరుపొందిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. 2011లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నమోదైన రైల్ రోకో కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
2011 అక్టోబర్ 15న, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద రైల్ రోకో నిర్వహించగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేసీఆర్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసినట్లు రికార్డులు ఉన్నాయి.
అయితే అప్పట్లో ఉద్యమ వేళ ఆందోళనలకు కేసీఆర్ పిలుపునిచ్చినప్పటికీ, ఆయనే ప్రత్యక్షంగా పాల్గొనలేదని ఆయన న్యాయవాది వాదించారు.
ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండగా, హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ కేసీఆర్ పిలుపు మేరకే ఆందోళన జరిగిందని పేర్కొన్నారు. అయితే, కేసీఆర్ ఘటన స్థలంలో లేకపోవడం, ప్రత్యక్ష సంబంధం లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆయనపై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పుతో కేసీఆర్ శిబిరంలో ఊపిరిపీల్చుకున్న వాతావరణం నెలకొంది. ఉద్యమ సమయంలో నమోదైన కేసులు రాజకీయ ప్రయోజనాల కోణంలో ఉండకూడదని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.