ఎల్కతుర్తి: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా విరుచుకుపడ్డారు. పేదల ఇళ్లను కూల్చేందుకు ఏర్పాటైన ‘హైడ్రా’ బృందాన్ని తీవ్రంగా ఖండించారు. “బుల్డోజర్లతో పేదల గుడిసెలను ధ్వంసం చేయడం దారుణం. చూస్తూ ఊరుకోకండి, పోరాడండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తమ ప్రభుత్వ హయాంలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణను దేశంలో అగ్రస్థానానికి తీసుకొచ్చామని, కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో వెనకబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. “ముల్లును ముల్లుతోనే తీయాలి” అంటూ వ్యూహాత్మకంగా పోరాడాలని సూచించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, భూముల ధరలు పడిపోయాయని కేసీఆర్ విమర్శించారు. గౌరెల్లి, పాలమూరు ప్రాజెక్టుల పనులు ఆలస్యం కావడంపై ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాల రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“పేదల కోసం రూపొందించిన పథకాలనే నిలిపేస్తారా? మా విజయలను చెరిపేస్తారా?” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు మద్దతుగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇక ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాల ఆపరేషన్ కగార్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతపై జల్లెడ వేసే చర్యలను నిలిపేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.