యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ ఆలయం అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పనులను పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు గురువారం యాదాద్రికి చేరుకోనున్నారు. ఆయన హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారని సమాచారం.
కాగా సీఎం యాద్రాద్రి చేరిన వెంటనే, ముందుగా స్వామివారి పూజలో పాల్గొంటారు. తరువాత ప్రధాన ఆలయంతో పాటు కొండపైన, కొండ కింద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. లక్ష్మీ నరసిమ్హ ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న, ఇప్పటికే పూర్తయిన, ఇంకా చేపట్టాల్సిన పనులపై సీఎం సదరు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ మేరకు వైటీడీఏ మరియు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో స్వయంభూ స్వామివారి పునఃదర్శనాలపై కూడా సీఎం కేసీఆర్ స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు బుధవారం సాయంత్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు.