ముంబై: ఇండియన్ క్రికెట్ లో మంచి గుర్తింపుని అందుకున్న మరో స్టార్ ఆటగాడు ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కెదార్ జాదవ్ తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ముంబయిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే సమక్షంలో జాదవ్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా జాదవ్ మాట్లాడుతూ, “ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు వందనం. మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో ఉంది. ఫడ్నవిస్, బావన్‌కులే లాంటి నాయకులతో కలిసి బీజేపీలో పని చేయడం గర్వంగా ఉంది” అన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావడంపై పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
బావన్‌కులే మాట్లాడుతూ, “క్రీడా రంగానికే కాదు, యువతలో మంచి ప్రభావం చూపిన వ్యక్తి జాదవ్. బీజేపీలో చేరినందుకు మేము గర్వపడుతున్నాం” అన్నారు. హింగోలీ, నాందేడ్ నుంచి పలువురు నాయకులు కూడా అదే కార్యక్రమంలో బీజేపీలో చేరారు.
జాదవ్ 2014లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసి, 73 వన్డేల్లో 1389 పరుగులు, 27 వికెట్లు సాధించారు. 2018 ఐపీఎల్‌ను సీఎస్‌కే తరఫున గెలిచారు. 2024లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడీ కొత్త రాజకీయ వేదికపై జాదవ్ ఎలా రాణిస్తారో చూడాల్సి ఉంది.