ఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్, తమ పార్టీ ఎలాంటి పొత్తులు పెట్టుకోదని స్పష్టంగా తెలిపారు. ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడం కీలక వ్యూహమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి, తనపై జరిగిన దాడి విషయాన్ని ప్రస్తావించిన కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తీవ్రంగా విమర్శించారు.
“ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా నాపై దాడి జరగడం దురదృష్టకరం. గ్యాంగ్ స్టర్లపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం మాపై కక్షగడుతోంది” అని అన్నారు.
కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్-ఆప్ పొత్తు ఆశించిన వర్గాలకు ఇది షాకింగ్‌గా మారింది.
ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ తమ అభ్యర్థులతో బరిలోకి దిగుతామని స్పష్టం చేయడం, ఆప్ కూడా అదే వైఖరిని అనుసరించడం బీజేపీకి లాభసాటిగా మారుతుందా లేదా అనే చర్చను ప్రేరేపించింది.
పంజాబ్ లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి ఆప్ నిరాకరించింది. ఇప్పుడు ఢిల్లీలో అదే విధానాన్ని కొనసాగిస్తూ, తమ పట్టు చాటేందుకు ఆప్ తీసుకున్న వ్యూహం ఏ మేరకు విజయవంతమవుతుందో వేచిచూడాల్సిందే.